Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, October 11, 2013

ఆదికాండము 9

Gen 9:1  మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
Gen 9:2  మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.
Gen 9:3  ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
Gen 9:4  అయినను మాంస మును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
Gen 9:5  మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
Gen 9:6  నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
Gen 9:7  మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
Gen 9:8  మరియు దేవుడు నోవహు అతని కుమారులతో
Gen 9:9  ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను,
Gen 9:10  పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.
Gen 9:11  నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.
Gen 9:12  మరియు దేవుడునాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
Gen 9:13  మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధ నకు గురుతుగా నుండును.
Gen 9:14  భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
Gen 9:15  అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు
Gen 9:16  ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.
Gen 9:17  మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
Gen 9:18  ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
Gen 9:19  ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
Gen 9:20  నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
Gen 9:21  పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
Gen 9:22  అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
Gen 9:23  అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట
Gen 9:24  అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని
Gen 9:25  కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
Gen 9:26  మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
Gen 9:27  దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
Gen 9:28  ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.
Gen 9:29  నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పు డతడు మృతిబొందెను.

No comments:

Post a Comment