Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, October 11, 2013

ఆదికాండము 21

Gen 21:1  యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.
Gen 21:2  ఎట్లనగా దేవుడు అబ్రాహా ముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.
Gen 21:3  అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరుపెట్టెను.
Gen 21:4  మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
Gen 21:5  అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి నప్పుడు అతడు నూరేండ్లవాడు.
Gen 21:6  అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.
Gen 21:7  మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.
Gen 21:8  ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.
Gen 21:9  అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
Gen 21:10  ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
Gen 21:11  అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.
Gen 21:12  అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.
Gen 21:13  అయినను ఈ దాసి కుమారుడును నీ సంతా నమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.
Gen 21:14  కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.
Gen 21:15  ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి
Gen 21:16  యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేతదూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.
Gen 21:17  దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;
Gen 21:18  నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
Gen 21:19  మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
Gen 21:20  దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.
Gen 21:21  అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
Gen 21:22  ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక.
Gen 21:23  నీవు నన్నైనను నా పుత్రపౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.
Gen 21:24  అందుకు అబ్రాహాముప్రమాణము చేసెదననెను.
Gen 21:25  అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకుఈ పని యెవరు చేసిరో నేనెరుగను;
Gen 21:26  నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా.
Gen 21:27  అబ్రాహాము గొఱ్ఱలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.
Gen 21:28  తరువాత అబ్రాహాము తన గొఱ్ఱల మందలో నుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక
Gen 21:29  అబీమెలెకు అబ్రాహాముతోనీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱపిల్లలు ఎందుకని యడిగెను. అందు కతడు
Gen 21:30  నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱ పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.
Gen 21:31  అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
Gen 21:32  బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.
Gen 21:33  అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను.
Gen 21:34  అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

No comments:

Post a Comment